-->

శత్రువుకు చిక్కకుండా ఉండాలంటే | Judges 1,2 | Telugu Bible Study



న్యాయాధిపతులు  పరిచయం

     న్యాయాధిపతుల గ్రంధములో యెహోషువ మరణించిన కాలం నుండి, సౌలు రాజయ్యే వరకు, వాగ్దాన దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో ఇశ్రాయేలీయుల మధ్య జరిగిన సంఘటనల గురించి, దేవుని పై తిరుగుబాటు చేసిన ప్రజలను రక్షించడానికి న్యాయాధిపతులను నియమించిన సంగతుల గురించి వ్రాయబడి ఉంది. ఈ గ్రంధాన్ని ప్రవక్త అయిన సమూయేలు వ్రాశాడు అని చెప్తారు.

   మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు విమోచించబడగా, యెహోషువ కాలంలో వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. 

 1వ అధ్యాయము


          ఇశ్రాయేలీయులు వారి వ్యక్తిగత ,కుటుంబ జీవితాల్లో విజయం కోసం, తమ వంశాలకి, గోత్రాలకి ఇయ్యబడిన స్వాస్థ్యాన్ని పూర్తిగా సంపాదించుకోవడం కోసం, వాగ్దాన ఫలాన్ని అనుభవించడం కోసం పూర్తిగా దేవుని పైన ఆధారపడవలసిన సమయం వచ్చింది. ఈ పరిస్థితులలో కనానీయుల మీద యుద్దానికి ముందుగా ఎవరు వెళ్లాలని ప్రార్థన చేసినప్పుడు యూదా వంశస్థులను వెళ్ళమని దేవుడు చెప్తాడు. అప్పుడు యూదా వారు షిమ్యోనీయులతో కలిసి వెళ్లి కనానీయులు, పెరిజ్జియులపై గెలుపొంది, రాజైన  అదోనీబెజెకును పట్టుకున్నారు. తర్వాత కాలేబు కుమార్తె అయిన అక్సా, తనకు,తన కుటుంబానికి కావలసిన దీవెనను ఎలా పొందుకుందో వ్రాయబడివుంది. దేవుడ్ని అడిగేటప్పుడు అక్సా వలె మనకు ఏమి కావాలో, ఏమి అవసరమో, నిశ్చయించుకుని విశ్వాసంతో అడగాలి. 

శత్రువుని ఉండనిచ్చారు

      తమ స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటున్న యూదా వంశస్థులతో దేవుడు తోడుగా ఉన్నందున వారు కొండ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతంలో నివసించేవారి దగ్గర ఇనుప రథాలున్నాయని చెప్పి వారిని వెల్లగొట్టలేదు. దేవుని తోడు కంటే ఇనుప రథాలే  బలమైనవని వారు భావించారు. దేవుడు శక్తిమంతుడే కానీ ఇంత పెద్ద సమస్య నుండి బయటపడటం చాలా కష్టం, ఆయన సహాయం చేసినప్పటికీ పాపాన్ని విడిచిపెట్టడం, మారుమనస్సు పొందడం మనవల్ల అయ్యే పనికాదు అనుకుంటాం. పరిస్థితులను బట్టి, మన భయాలు ఆశలని బట్టి, అనుకూలతలను బట్టి కొన్ని సార్లు దేవుని నమ్మతాము, కొన్నిసార్లు నమ్మలేము. యూదా వారు గుర్రాలని, రథాలని చూసారు గానీ, ఫరో రథాలని సముద్రంలో ముంచేసిన దేవుని శక్తిని నమ్మలేదు ( కీర్తన 20:7). వీరు మైదాన ప్రాంతం వారిని వెళ్లగొట్టకుండా ఉంటే బెన్యామీయులేమో యెబూసీయులను వెళ్లగొట్టకుండా మీరు విడిచిపెట్టిన జనులు మీకు ప్రక్కలో బల్లెంగా ఉంటారు అని యెహోషువ హెచ్చరించిన మాటని వారు గ్రహించలేదు.

కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. కీర్తనలు 20:7 

  దేవుడు తోడుగా ఉండుటనుబట్టి మనష్షీయులు, ఎ ఫ్రాయిమీయులు కూడా వారి భాగాలను స్వాధీనం చేసుకున్నారు కానీ,కొన్ని చోట్ల రాజీపడిపోయి,కనానీయులను తమ మధ్యలోనే నివాసం ఉండనిచ్చారు. బలమైన జనమైన ఇశ్రాయేలీయులు వారితో వెట్టిపనులు చేయించుకుంటున్నారు గానీ కనానీయులను మాత్రం పూర్తిగా వెళ్లగొట్టలేదు. ఆమోరియులయితే మేం ఇక్కడే నివసిస్తాము అని గట్టి పట్టు పట్టి యోసేపు ఇంటివారి మధ్య వ్యాపించేశారు. దేవుడ్ని, ఆయన కట్టడను ఎరిగియుండి కూడా శత్రువు ఆక్రమించిన తమ స్వాస్థ్యాన్ని పూర్తిగా సొంతం చేసుకోకుండా, నిబంధనని మరచిపోయి, తమతో శత్రువును నివసింపనిస్తున్నారు. వెళ్లగొట్టకపోతేనేమి, శత్రువు మా చేతి క్రిందే వున్నాడు, మాదే పై చేయి అనుకున్నారు. అయితే అపవాది తంత్రములను ఎదిరించకుండా, హృదయాన్ని అసంపూర్తిగానే దేవునికిచ్చి,మిగిలిన భాగాన్ని స్వీయ ఆశలతో, లోకంలో సర్దుబాటు  చేసికుని జీవిస్తే అదే మనకి  ఉరిగా మారుతుంది. కానీ మనం జయించి ఆయనతో పాటు దేవుని కుమారులవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. 

        యేసయ్య మన కోసం పూర్తిచేసిన రక్షణ కార్యం మనలో నెరవేరి, ఈ లోకంలో మంచి పోరాటం పోరాడి, దేవుని రాజ్యంలో బహుమానం పొందడానికి ఆయన మన కోసం, మన కంటే ముందు జయించనిది అంటూ ఏమి మిగిలి లేదు. సిలువలో యేసయ్య యొక్క మహిమకరమైన ఆ విజయం యొక్క విలువను గ్రహించి, ఆయన పునరుద్దాన శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు మన భయాలు,శోధనలు, సమస్యలు అన్నిట్లో విజయాన్ని అనుభవిస్తాము.

2వ అధ్యాయము

శత్రువుతో రాజీపడి

          ఈ అధ్యాయములో దేవుని దూత ప్రజలతో మాట్లాడుతూ నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని ఇక్కడికి రప్పించినప్పుడు మీకు అజ్ఞాపించాను,నేను చేసిన నిబంధనని ఎప్పటికి మీరను, ఇక్కడివారితో మీరు ఎలాంటి నిబంధన  కూడా చేసుకోవద్దని, మీరేమో నా మాట వినలేదు.కాబట్టి మీ యెదుటనుండి వీరిని వెళ్లగొట్టను. వారు మీ ప్రక్కలో శూలములుగా ఉంటారు అని చెప్పాడు. ఆ మాటలకి ప్రజలు ఏడ్చి అక్కడ దేవునికి బలి అర్పించారు.

          యెహోషువ బ్రతికి ఉన్నప్పుడు, దేవుని కార్యాలను చూసిన పెద్దలు బ్రతికి ఉన్నప్పుడు ప్రజలు దేవుని సేవించారు గానీ, వారి తర్వాత వచ్చిన దేవుని కార్యాల గురించి వినని తరం మాత్రం దేవుని దృష్టిలో కీడు చేసి, ఆయనను విసర్జించి, తమ చుట్టూ ఉన్నవారు చేయుచున్న హేయమైన పనులు చేస్తూ దేవునికి కోపం పుట్టించారు. వారు వారి సంతానం తరతరములు దేవుని గురించి తెలుసుకోవాలని, వారు ఆచరించిన పండుగల గురించీ, ఆజ్ఞల గురించి, మోషే ధర్మశాస్త్రములో వ్రాసి ఉంచాడు. పడుకునేటప్పుడు,లేచినప్పుడు, బయటకి వెళ్ళినప్పుడు,లోనికీ వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పాలి. వారి నుదుట బాసికంగా,చేతికి కంకణంగా వాటిని కట్టాలి అని చెప్పాడు. యెహోషువ కూడా మేము దేవుడినే సేవిస్తాము అని ప్రజల చేత నిబంధన చేయించాడు. అయినా ప్రజలు తాము చేసిన నిబంధనని మీరి, లోకంతో రాజీపడిపోయి, నెమ్మది నెమ్మదిగా కనానీయులతో కలిసిపోయారు. దేవుని యొక్క గుణాతిశయములను తమ పిల్లలకి తెలియ చేయాల్సిన బాధ్యత విస్మరించారు. వారిని నాయొద్దకు రానీయండి అని చిన్నపిల్లల గురించి యేసయ్య చెప్పాడు. పెద్దలు తల్లిదండ్రులు మాత్రమే దేవుడ్ని తెల్చుకోవడం, ప్రార్ధన చేయడం కాదు.



       దేవుడ్ని ఏరిగియుండడం, ఆయనతో సహవాసం కలిగి ఉండడం వ్యక్తిగతమైనది. ప్రతీ ఒక్కరిది. ఇక్కడ దేవుని ఎరుగని తరమువారు దేవునికి శత్రువులైపోయారు. వెళ్లగొట్టాల్చిన శత్రువుని తమతో ఉండనీయుటనుబట్టి , వారు వీరి కుటుంబాల్లోకి, వీరి జీవితల్లోకి ప్రవేశించారు. ఇంతకు ముందు వేటిని అసహ్యించుకున్నారో ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ హేయమైన పనులనే చేస్తున్నారు.

శత్రువు చేతికి చిక్కి ( అపవాదికి చిక్కి)


         దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తాము అని వారు చేసిన నిబంధనని బంధకములుగా భావించి, వాటిని మీరి,ఇప్పుడు అపవాదికి, లోకానికి బంధిలైపోయారు. శత్రువుకంటే బలమైనవారమని  తలంచి, ఇప్పుడు శత్రువు చేతికి చిక్కారు, దోచుకోబడ్డారు. దేవుడ్ని విసర్జించారు కాబట్టి  ఆయన వారితో లేడు, వారికి శత్రువైపోయాడు.దేవుని కృపని వ్యర్థం చేసుకుని ఆయన కోపాగ్నికి గురయ్యారు. కనానీయుల చేత ఇబ్బందులు పడుతున్నారు. అయితే దేవుడు, వారిని వారి బాధని చూసి, వారిని శత్రువుల చేతి నుండి రక్షించడానికి న్యాయాధిపతులని పుట్టించాడు. ఆ న్యాయాధిపతులు వారిని రక్షించినప్పుడు వారు కొంత కాలం వరకూ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నారు, కొంత కాలం తర్వాత మరలా మార్గం తప్పి నడుస్తున్నారు. అప్పుడు శత్రువు చేతికి చిక్కి బాధపడుతున్నవారిని మరలా న్యాయాధిపతుల చేత విడిపిస్తున్నాడు. ఇలా ఆయా కాలాల్లో, ఆయా ప్రదేశాల్లో నమ్మకస్తులైన వారిని దేవుడు న్యాయాధిపతులుగా నియమించి ప్రజలను రక్షిస్తున్నాడు. అయితే వారు చనిపోయినప్పుడు ప్రజలు మరలా తమ మూర్ఖ ప్రవర్తనతో చెడ్డవారై పోతున్నారు. ఇలా జరుగుతుండగా దేవుని కోపం వారి మీద మండి, ఈ ప్రజలు నా మాట వినకుండా నిబంధనను మీరుతున్నారు. వీరు నా విధిని అనుసరించి నడుస్తారో లేదో ఈ జనుల శోధన వలన తెలుస్తుంది అని దేవుడు ఆ జనులను వారి మధ్య నుండి వెళ్లగొట్టలేదు.

దేవుని దీర్ఘశాంతము

       దేవుడ్ని విసర్జించి, శత్రువు చేతికి చిక్కి బాధపడడం, వారి బాధను చూసి దేవుడు వారికోసం న్యాయాధిపతులను పంపించడం, కొంత కాలం నమ్మకంగా ఉండి మరలా మూర్ఖులుగా ప్రవర్తించడం, ఈ విధంగా ఇశ్రాయేలీయులు కొనసాగుతూ ఉన్నారు. దేవుని కార్యాలను మరచిపోయి, కృతజ్ఞత లేకుండా, మూర్ఖత్వంతో, బుద్ధిహీనంగా దేవునికి దుఃఖం కలిగించి,  కోపం పుట్టిస్తున్నా, ఆయన తన ప్రజల  యెడల ఇంకా దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. హృదయంలో, జీవితంలో, దేవునికి రావలసిన మహిమను ఆయనకివ్వకుండా, దొంగిలించి, వేరేవాటికి ఇస్తున్న ప్రజలను రక్షించడానికి, ఆయన తన మహిమను విడిచి దిగివచ్చాడు.

" కీడు వలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము" (రోమా 12:12)

ప్రార్ధన

       పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రీ, నీ గొప్ప నామమునకు వందనాలు. మేము ప్రార్ధించునప్పుడు మాకు కావలసిన వాటిని అడిగి పొందుకునే విశ్వాసాన్ని ఇవ్వండి. ఇంకా పూర్తిగా నీకు లోబడకుండా ఉన్న మా హృదయంలో ప్రతీ స్వభావాన్ని, ఆశల్ని తీసివేసుకోడానికి సహాయం చేయండి. వ్యర్ధమైన వాటిని ఇంకా మా జీవితాల్లో ఉండనిచ్చి, అపవాది చేతిలో పడకుండా మమ్మల్ని విడిపించండి. మేము ఎల్లప్పుడూ నీకు లోబడి, జీవించడానికి మా జీవితాల్లో అనుమతించిన పరిస్థితిలన్నింటిలో నీ క్రమశిక్షణలో నేర్చుకోడానికి సహాయం చేయండి. నీవే మొదట మమ్మల్ని ప్రేమించి, మా కోసం  సిద్ధపరచిన శ్రేష్ఠమైన వాటన్నిటిని బట్టి నీకు వందనాలు. మనుషులపై కాక వ్యక్తిగతంగా, నీ మీద ఆధారపడి జీవించే కృపనీయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రీ. ఆమెన్..
-శుభవచనం